
బాధ్యతగా వినతులు పరిష్కరించండి
నంద్యాల: ప్రజా వినతులను బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రామునాయక్‌లు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత కాల పరిమితి లోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్‌మెంట్‌ను కూడా వారికి అర్థమయ్యే రీతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్, ర్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా అధికారులు జరిపే ఉత్తర, ప్రత్యుత్తరాలు కేవలం ఈ ఆఫీస్ ద్వారానే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గుర్తించిన 42 వేల మంది బంగారు కుటుంబాలు, 2800 చెంచు కుటుంబాలు ఉన్నాయని వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో బాత్‌రూమ్స్, మరుగుదొడ్లు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో 284 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డెంగీ మాసోత్సవాలను
విజయవంతం చేయండి
జిల్లాలో జూలై 1 నుంచి నిర్వహించే డెంగీ మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో డెంగీ మాసోత్సవాలకు సంబంధించిన ప్రచార పత్రాలను జేసీ విష్ణుచరణ్, వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దోమల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాము నాయక్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి