
అభ్యంతరాలు.. ఆందోళనలు
కర్నూలు(హాస్పిటల్): అభ్యంతరాలు, ఆందోళనల మధ్య గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–3 ఏఎన్‌ఎంలకు సోమవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ ఆడిటోరియంలో ఉదయం 7.30 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 750 మందికి పైగా ఏఎన్‌ఎంలకు బదిలీ కౌన్సిలింగ్ చేయాల్సి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.శాంతికళ, ఏవో అరుణ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్‌లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు వచ్చాయి. వందకు పైగా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు రావడం, అందులోనూ కొన్ని సచివాలయాలకు ఎక్కువ మందికి లేఖలు ఇవ్వడంతో అధికారులు అయోమయానికి గురయ్యారు. ఈ లేఖలతో పలు సంఘాల లేఖలను సైతం పక్కన బెట్టి ర్యాంకు ఆధారంగా సాయంత్రం 200 మందికి మాత్రమే కౌన్సెలింగ్ చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగించి, మిగిలిన వారికి మంగళవారం కూడా కౌన్సెలింగ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో కొందరు ఏఎన్‌ఎంలు ఇతర పీహెచ్‌సీలకు గాకుండా పక్క పీహెచ్‌సీలోని సచివాలయాలకు బదిలీ చేయాలని నినాదాలు చేశారు. దీంతో అధికారులు భోజన విరామాన్ని ప్రకటించి ఉన్నతాధికారుల వివరణ తీసుకుని పక్క పీహెచ్‌సీలకు సచివాలయ ఉద్యోగులను బదిలీ చేసేందుకు అంగీకరించారు.
గందరగోళంగా
ఏఎన్‌ఎంల బదిలీల ప్రక్రియ