నాణ్యమైన విద్యనందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యనందించాలి

Jun 28 2025 5:29 AM | Updated on Jun 28 2025 8:49 AM

నాణ్య

నాణ్యమైన విద్యనందించాలి

గోస్పాడు: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పార్వతీపురం హైస్కూల్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడి పాఠశాల యూపీ వరకు కొనసాగుతుండేదని, ప్రస్తుతం హైస్కూల్‌గా మార్పు చేసి 9వ తరగతి కొనసాగుతుందని, ప్రస్తుతం పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అదనంగా ఉపాధ్యాయులు పెంచేలా చూడాలన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని, విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పరిశీలించారు.

54,784 మందికిఇంటి వద్దనే రేషన్‌ పంపిణీ

నంద్యాల(అర్బన్‌): జిల్లాలోని వృద్ధులు, దివ్యాంగులు, నిస్సాహాయ స్థితిలో ఉన్న 54,784 మందికి జూలై నెలకు సంబంధించి ఇళ్ల వద్దనే రేషన్‌ పంపిణీ జరుగుతోంది. కార్డు కలిగిన వయస్సు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, నిస్సాహాయ స్థితిలో ఉన్న వారు జిల్లాలో దాదాపు 54,784 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు డీలర్లు, వీఆర్‌ఓల ఆధ్వర్యంలో ఇళ్ల వద్దకే వచ్చి రేషన్‌ పంపిణీ చేయనున్నారు. రేషన్‌ పంపిణీ ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని ముందుగానే తెలియజేస్తారు. జాబితా ప్రకారం డీలర్‌ వారి ఇంటి వద్దకు వెళ్లి రేషన్‌ పంపిణీ అందించాలని, అలా ఇవ్వని డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 26, 27వ తేదీల్లో 7,604 మందికి 13.88 శాతంతో రేషన్‌ పంపిణీ జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

డీఏఓ బాధ్యతల స్వీకరణ

నంద్యాల(అర్బన్‌): జిల్లా వ్యవసాయాధికారిగా వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డీఏఓగా ఉన్న మురళీకృష్ణ విజయవాడ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గుంటూరు డీడీఏగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లును నంద్యాల జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లును వ్యవసాయాధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అలాగే నంద్యాల ఏడీఏగా ఆంజనేయ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఏడీఏగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌ కర్నూలుకు బదిలీ కాగా ఆత్మకూరు ఏడీఏగా పని చేస్తున్న ఆంజనేయ బదిలీపై నంద్యాల ఏడీఏగా బాధ్యతలు స్వీకరించారు.

ఆశా కార్యకర్తల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

గోస్పాడు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల ఉద్యోగ భర్తీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 24, పట్టణ ప్రాంతాల్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిర్ణీత దరఖాస్తు నమూనాలను https://nandyal.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందు పరిచారన్నారు. దరఖాస్తులను ఈనెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ లోపు పట్టణాల్లో వారు వార్డు సచివాలయాల పరిధిలోని యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లకు, గ్రామీణ ప్రాంతాల వారు పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లకు అభ్యర్థులు స్వయంగా తమ దరఖాస్తులను అందజేయాలన్నారు.

నిత్యాన్నదానానికి కూరగాయల వితరణ

మహానంది: మహానందిలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద పథకానికి అవసరమైన మేరకు కూరగాయలను ఉచితంగా పంపించేందుకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌ మార్కెట్‌కు చెందిన వ్యాపారులు ముందుకు వచ్చారని ఏఈఓ ఎరమల మధు, ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. ఈ మేరకు వేదపండితులు రవిశంకర అవధాని, హనుమంతుశర్మ, అన్నప్రసాద పథకం ఇన్‌చార్జ్‌ రామశివలు శుక్రవారం హైదరాబాద్‌ వెళ్లి మార్కెట్‌లోని వ్యాపారులను కలిశారు. మార్కెట్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్రారెడ్డి, జయప్రకాష్‌రెడ్డిలతో పాటు సభ్యులైన బుచ్చయ్య, శ్రీశైలం నరసింహులు, భాస్కర్‌రెడ్డి, రాకేష్‌ రెడ్డి, తదితరులను కలిసి విన్నవించగా వారు ఒప్పుకున్నారని వివరించారు.

నాణ్యమైన విద్యనందించాలి 1
1/1

నాణ్యమైన విద్యనందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement