
నెల వంక దర్శనం.. మొహర్రం ప్రారంభం
చాగలమర్రి: ఇస్లాం క్యాలెండర్ ప్రకారం గురువారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనంతో నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి నెల మొహర్రం కావడంతో హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం పది రోజుల పాటు సంతాప కార్యక్రమాలు జరుపుకుంటారు. మొహర్రం నెలలోనే ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ రసూలల్లా సొల్లేల్లాహు అలైహి వసల్లం మనువళ్లు ఇస్లాం మత వ్యాప్తి కోసం కర్బాలా మైదానంలో (సౌదీలో) 10 రోజుల పాటు యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో వారి వంశానికి చెందిన 72 మంది అశువులు బాసి వీరమరణం పొందారు. వారిని స్మరించటానికి ఏటా మొహర్రం నెలలో పది రోజులపాటు కార్యక్రమాలు చేస్తారు. ఈ మేరకు ఊరూరా పీర్ల చావిడ్లలో పీర్లను కొలువుదీర్చి పూజలు చేయనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పీర్ల దేవుళ్లను భద్రపరిచిన పెట్టెలను సంప్రదాయ మేళతాళాలలతో ఊరేగింపుగా తీసుకొచ్చి చావిడ్లకు చేర్చారు.
చాగలమర్రిలో
మత సామరస్యానికి ప్రతీకగా..
చాగలమర్రిలో నిర్వహించే పండగల్లో పీర్ల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనడంతో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. గ్రామంలోని లాల్‌స్వామి, హజ్రత్ ఇమాం హస్సేన్, హజ్రత్ ఇమాం హుసేన్, హజ్రత్ ఇమామే ఖాశీం, హజ్రత్ హురేషహీద్, హజ్రత్ ఆలీ అక్బర్ (గుర్రం మీద పీరు)లను కొలువు దీర్చి 10 రోజుల పాటు పూజలు చేయనున్నారు. భక్తులు ప్రత్యేక చదివింపులు, ముడుపులు చెల్లించునున్నారు. వెండి గొడుగులు, ఉయ్యాలలు, విలువైన చాదర్‌లు సమర్పించనున్నారు. గ్రామానికి చెందిన వారు వృత్తి రీత్యా సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన మొహర్రం వేడుకలకు తప్పకుండా హాజరవుతారు. ప్రతి ఇల్లు బంధువులు, స్నేహితులతో కళకళలాడనున్నాయి.
ఊరూరా కొలువుదీరనున్న పీర్లు

నెల వంక దర్శనం.. మొహర్రం ప్రారంభం