
ఉచిత పంటల బీమాకు మంగళం
● ఈ ఖరీఫ్ నుంచి
ప్రీమియం చెల్లిస్తేనే వర్తింపు
● కర్నూలు జిల్లాలో 11,
నంద్యాల జిల్లాలో 13 పంటలకు బీమా
● రెండు జిల్లాల్లో వరికి
గ్రామం యూనిట్‌గా అమలు
● ఉమ్మడి జిల్లాలో పత్తి 2,53,236
హెక్టార్లలో సాగు
● రైతులపై రూ.126.61 కోట్ల భారం
నంద్యాల జిల్లా
రైతులపైనే అధిక భారం
● ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతు వాటా ప్రీమియం మొత్తాన్ని తగ్గించడం కాస్త ఊరట కలిగించే విషయం.
● కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ఎండుమిర్చికి 0.40 శాతం ఉండగా.. మిగిలిన 8 పంటలకు 0.20 శాతం ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంది.
● నంద్యాల జిల్లాలో రైతుల వాటా ప్రీమియం ఎక్కువగా
ఉంటోంది.
● వరి, మొక్కజొన్న, కంది పంటలకు 2 శాతం, మినుము, జొన్న, సజ్జ, కొర్ర, ఆముదం, ఉల్లి పంటలకు 1 శాతం, ఎండుమిర్చికి 3.20 శాతం, పత్తికి 4 శాతం ప్రకారం ప్రీమియం చెల్లించాలి.
● నంద్యాల జిల్లాలో అరటికి వాతావరణ ఆధారిత బీమా ఉంది. బీమా రూ.1,37,500 మొత్తానికి 5 శాతం ప్రకారం రూ.6,875 ప్రీమియం చెల్లించాల్సి ఉంది.
● ప్రదానమంత్రి ఫసల్ బీమా(దిగుబడి ఆధారిత బీమా) కింద గ్రామం యూనిట్‌గా వరి, మండలం యూనిట్‌గా మిగిలిన పంటలు నోటిఫై అయ్యాయి.
కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2024–25 రబీ నుంచి ఉచిత పంటల బీమాకు మంగళం పిలికింది. సూపర్–6లో భాగంగా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో ఆ ఊసే మరిచారు. తాజాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులవుతున్నా ఇప్పటికీ కాలయాపన చేస్తున్నారు. తాజాగా ఉచిత పంటల బీమాను రద్దు చేసి ప్రీమియం చెల్లిస్తేనే బీమా వర్తింపును అమలు చేస్తున్నారు. 2024 ఖరీఫ్ సీజన్ వరకు ఉచిత పంటల బీమాను అమలైనా.. అధిక వర్షాలు, వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నప్పటికీ ఒక్క రూపాయి పరిహారం అందివ్వని పరిస్థితి. 2024–25 రబీ నుంచి ప్రీమియం చెలించడం ద్వారా ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆదారిత బీమాను అమలు చేసింది. అయితే పరిహారం వస్తుందో.. లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా అమలుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రీమియం చెల్లిస్తేనే బీమా వర్తింపు విధానం అమలు చేస్తుండటం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పత్తికి బీమా చేసుకోవాలంటే
హెక్టారుకు రూ.5వేలు
కర్నూలు జిల్లాలో పత్తి 2,34,409 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 18,827 హెక్టార్లలో సాగవుతుంది. రూ.లక్షకు బీమా చేస్తారు. వాతావరణ ఆధారిత బీమా కింద 5 శాతం ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అంటే హెక్టారుకు రూ.5వేలు చెల్లించాల్సిన పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో పత్తి 2,53,236 హెక్టార్లలో సాగు చేస్తారు. మొత్తం పత్తికి బీమా చేయాలంటే ప్రీమియం రూపంలో రూ.126.61 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం జూలై 15లోపు, ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద జూలై 31లోపు ప్రీమియం చెల్లించాలి. వరికి మాత్రం ఆగస్టు 15 వరకు గడువు ఉంటుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కర్నూలు జిల్లాలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, నంద్యాల జిల్లాలో ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, వాతావరణ ఆధారిత బీమాను కర్నూలు జిల్లాలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, నంద్యాల జిల్లాలో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అమలు చేస్తున్నాయి.
నంద్యాల జిల్లాలో బీమా చేయించుకోవాలంటే ప్రీమియం ఇలా..
పంట బీమా యూనిట్ బీమా చేసే మొత్తం రైతు వాటా
(హెక్టారుకు రూశ్రీశ్రీల్లో) (హెక్టారుకు రూశ్రీశ్రీల్లో)
పత్తి మండలం యూనిట్ 1,00,000 4,000(4 శాతం)
వేరుశనగ మండలం యూనిట్ 70,000 1,400(2 శాతం)
అరటి మండలం యూనిట్ 1,37,500 6,875(5 శాతం)
వరి గ్రామం యూనిట్ 1,00,000 2,000(2 శాతం)
మొక్కజొన్న మండలం యూనిట్ 82,500 1,650(2 శాతం)
కంది మండలం యూనిట్ 50,000 1,000(2శాతం)
మినుము మండలం యూనిట్ 47,500 475(1 శాతం)
ఎండుమిరప మండలం యూనిట్ 2,25,000 7,200(3.20శాతం)
జొన్న జిల్లా యూనిట్ 47,500 475( 1 శాతం)
ఆముదం జిల్లా యూనిట్ 40,000 400(1 శాతం)
కొర్ర జిల్లా యూనిట్ 40,000 400(1 శాతం)
సజ్జ జిల్లా యూనిట్ 40,000 400(1 శాతం)
ఉల్లి జిల్లా యూనిట్ 1,12,500 1125(1 శాతం)
వైఎస్సార్‌సీపీ పాలనలో రూ.1065.61 కోట్ల పరిహారం
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాది అంటే 2019–20లో కేవలం ఒక్క రూపాయి ప్రీమియంతో నోటిఫై చేసిన పంటలకు బీమా సదుపాయం కల్పించింది. 2020–21 నుంచి వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు పంటల బీమా సదుపాయం కల్పించే ఏర్పాటు చేయడం విశేషం. 2019–20 నుంచి 2022–23 వరకు ఉచిత పంటల బీమా కింద రైతన్నలకు చెల్లించిన పరిహారం రూ.1065.61 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయింది. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే బీమా పరిహారం విడుదల చేయడం వల్ల రైతులకు ఊరట లభించింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా దేశానికే ఆదర్శం కావడం విశేషం.
15లోపు పంటల బీమా
చెల్లించండి
కర్నూలు(సెంట్రల్): 2025–26 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా ప్రీమియం జూలై 15లోపు చెల్లించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా రైతులకు సూచించారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల పోస్టర్లను ఆవిష్కరించారు. పత్తి, వేరుశనగ పంటలను మండలం యూనిట్‌గా ఖరీఫ్ పంటకాలనికి నోటిఫై చేయగా, జూలై 15లోపు బీమాను చెల్లించాల్సి ఉందన్నారు. పత్తికి హెక్టారుకు రూ.5వేలు, వేరుశనగకు హెక్టారుకు రూ.1,400 చెల్లించాలని సూచించారు. కాగా, పంటలు నష్టపోతే పత్తికి సంబంధించి హెక్టారుకు రూ.లక్ష, వేరుశనగకు రూ.70 వేల వరకు చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మీ, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద నోటిఫై పంటలు: 9
( వరి, జొన్న, ఎండుమిర్చి, మొక్కజొన్న,
ఆముదం, కంది, ఉల్లి, కొర్ర, సజ్జ )
వాతావరణ ఆధారిత బీమా కింద నోటిఫై పంటలు: 2
( పత్తి, వేరుశనగ )
నంద్యాల జిల్లాకు అదనంగా
మినుము, అరటికి
వాతావరణ ఆధారిత బీమా వర్తిస్తుంది