
భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి
ఉయ్యాలవాడ: నంద్యాల, జమ్మలమడుగు జాతీయ రహదారి–167 నిర్మాణం కోసం భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రహదారికి మండల పరిధిలోని అల్లూరు, నర్సిపల్లె, మాయలూరు, రూపనగుడి, బోడెమ్మనూరు గ్రామాలకు చెందిన రైతుల నుంచి 30.93 ఎకరాల భూమి అవసరం కాగా భూ సేకరణ కూడా పూర్తయిందన్నారు. అయితే రైతులకు అందా ల్సిన పరిహారం, నగదు బదిలీ వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సువర్ణాదేవికి సూచించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్‌బాబు, వీఆర్‌ఓలు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
ఆషాఢమాసం ఎఫెక్ట్
మహానంది: ఆషాఢమాసం ప్రారంభం కావడంతో మహానందికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేసవిసెలవులతో పాటు శుభముహూర్తాలు ఉన్నందున గత నెలరోజులుగా నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడిన మహానందీశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం భక్తులు లేక వెలవెలబోతూ కనిపించింది.
భవిత కేంద్రాలతో మెరుగైన ఫలితాలు
శిరివెళ్ల: భవిత కేంద్రాలతో ప్రత్యేక అవసరాల పిల్లల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఐఈ జిల్లా కో–ఆర్టినేటర్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక భవిత కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఫిజియోథెరిపీని పరిశీలించి పిల్లల శారీరక మార్పులను డాక్టర్ అరుణేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. చెవిటి, మూగ, శారీక ఎదుగుల లోపం, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు చదువు, వైద్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానంగా కేంద్రాలున్నాయని చెప్పారు. అనంతరం ఎంఈఓ నాగార్జునరెడ్డితో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ విద్య మిత్ర కిట్లను పంపిణీ చేశారు.
వ్యవసాయ శాఖ ఏడీఏల బదిలీలు కొలిక్కి
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో ఎట్టకేలకు ఏడీఏల బదిలీలు కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ డిల్లీరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రానికి డోన్ ఏడీఏ అశోక్‌వర్ధన్‌రెడ్డి, శైలకుమారీలను నియమించారు. తాజాగా అశోక్‌వర్ధన్‌రెడ్డిని భూసార పరీక్ష కేంద్రం ఏడీఏగా నియమించారు. శైలకుమారికి పోస్టింగ్ ఇవ్వలేదు. మొదట పలమనేరులో ఏడీఏగా పనిచేస్తున్న అన్నపూర్ణను ఎమ్మిగనూరు సీడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏడీఏగా నియమించారు. తాజా ఉత్తర్వుల్లో ఈమె పేరు లేదు. కర్నూలు డీఆర్‌సీలో ఏడీఏగా పనిచేస్తున్న గిరీష్ ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. అయినప్పటికీ నందికొట్కూరు ఏడీఏగా బదిలీ చేశారు. అయితే ఈ పోస్టులో ఎవ్వరినీ నియమించలేదు. ఈ పోస్టు కోసం అన్నపూర్ణ కూటమి పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి