
స్వర్ణరథంపై ఆదిదంపతులు
శ్రీశైలంటెంపుల్: ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం గురువారం ఆది దంపతులకు స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించింది. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజల అనంతరం రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. వర్షం కారణంగా స్వర్ణరథోత్సవం నిలుపుదల చేశారు. స్వర్ణరథం వద్ద కళా బృందాల కోలాటం, తప్పెట చిందు మొదలైన కళారూపాలు ఏర్పాటు చేశారు. సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు, స్వామివారి ప్రధానార్చకులు, అర్చకస్వాములు, వేదపండితులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఐదు కేంద్రాల్లో నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరిగిన టీజీటీ ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ పరీక్షలు జరిగాయి. ఉదయం న్విహించిన పరీక్షకు 871 మందికి గాను 800 మంది హాజరు కాగా 70 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 110 మందికి గాను 91 మంది హాజరు కాగా 19 మంది గైర్జారైనట్లు డీఈఓ తెలిపారు.