
కర్నూలులో 30న ముస్లిం బహిరంగ సభ
నంద్యాల(వ్యవసాయం): వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల 30న కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు మౌలానా జాకీర్‌హుసేన్ తెలిపారు. నంద్యాలలోని డబరాల మసీదులో బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జాకీర్‌హుసేన్ మాట్లాడుతూ.. ‘వక్ఫ్ బాచావో.. దస్తూర్ బచావో’అని కోరుతూ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముస్లింలు అందరూ పాల్గొనాలని కోరారు. జేఏసీ నాయకులు మౌలానా అబ్దుల్లా రషాదీ, అబ్దుల్‌సమ్మద్, బాషా, ఇద్రూస్, ఎజాజ్, ఇబ్రహీం, హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలానికి పెరుగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి ఎగువన ఉన్న జూరాల, తుంగభద్ర ప్రాజెక్ట్‌ల నుంచి దిగువకు వరదనీరు ప్రవహిస్తోంది. మంగళవారం నుంచి బుధవారం వరకు 58,411 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. డ్యాం పరిసర ప్రాంతాలలో 0.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 461 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో స్వల్పంగా 0.075 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 143 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అలాగే బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 318 క్యూసెక్కుల నీటని విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సమయానికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 860.20 అడుగులకు చేరుకోగా, జలాశయంలో 106.6764 టిఎంసీల నీరు నిల్వ ఉంది.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా శశికళారెడ్డి
నంద్యాల: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పీబీ శశికళారెడ్డి(నంద్యాల)ని నియమించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించిన పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నంద్యాల జిల్లాలోని పలువురికి పదవులు దక్కాయి. బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుండి వెలువడిన ప్రకటన మేరకు రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శులుగా ఎం.శివరామిరెడ్డి(బనగానపల్లె), ఎం.వెంకటేశ్వరరెడ్డి(డోన్), రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా డి.మధుసూదన్‌రెడ్డి(డోన్)ని నియమించారు.

శశికళారెడ్డి