
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణాతో కలిసి జిల్లా స్థాయి రహదారి భద్రతా సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్, రెండు నెలల్లో 98 రహదారి ప్రమాదాల జరగగా, అందులో 54 మంది మృతి చెందారన్నారు. ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నూనెపల్లి నుంచి బొమ్మలసత్రం వెళ్లే దారిలో లైటింగ్ పెంచాలని చెప్పారు. ఆళ్లగడ్డ బైపాస్ ఎంట్రీ, ఎగ్జిట్ దారుల్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, వాటి వద్ద సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. పట్టణంలో సీఎంఆర్ వస్త్ర దుకాణానికి సంబంధించి పార్కింగ్ స్థలం లేదని, టౌన్‌హాల్‌లో పార్కింగ్ చేసుకుని అందుకు తగిన రుసుంను మున్సిపల్ నిధిలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు అవసరమైన స్పీడ్ గన్స్ అందజేయాలని ఉన్నతాధికారులకు లేఖ సిద్ధం చేయాలన్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ.. హిట్ అండ్ రన్ 41 కేసులు నమోదు కాగా అందులో 29 కేసుల వివరాలు కలెక్టర్ కార్యాలయానికి పంపామన్నారు. నంద్యాల ఏఎస్పీ మందాజావళి ఆల్ఫోన్స్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా రవాణా అధికారి ఐశ్వర్య రెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, నేషనల్ ప్రాజెక్టు డైరెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.