
సీమ ప్రాజెక్టులకు తక్షణమే నీరు విడుదల చేయాలి
నంద్యాల(అర్బన్): శ్రీశైల రిజర్వాయర్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. రిజర్వాయర్ నుంచి విడుదల చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర జల వనరుల శాఖకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరిన నేపథ్యంలో పోతిరెడ్డిపాడు, మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి సీమ ప్రాంతానికి నీరు విడుదల చేయాలన్నారు. ముందస్తు వర్షాలు కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ ఆయకట్టు కింద లక్ష ఎకరాలకు పైగా మొక్కజొన్న, సోయాబిన్, మినుము, తదితర ఆరు తడి పంటలను సాగు చేశారన్నారు. ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేసి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో కేసీ కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు రామసుబ్బారెడ్డి, బాలీశ్వరరెడ్డి, వైఎన్‌రెడ్డి, అసదుల్లా, మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రావు పాల్గొన్నారు.