
నేడు ‘యువత పోరు’
బొమ్మలసత్రం: నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సోమవారం యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టామని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్‌యాదవ్ తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్నామని హామీ ఇచ్చారని, అలాగే 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మించారన్నారు. ప్రభుత్వం ఏర్పాటై నేటికి ఏడాది పూర్తయినా నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరవేర్చాలన్న డిమాండ్‌తోనే సోమవారం యువత పోరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. స్థానిక ఉదయానంద రెసిడెన్సీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందిస్తున్నామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థి, నిరుద్యోగ యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.