
సికిల్‌సెల్‌తో చిక్కిశల్యం
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్ర రక్త కణాలు గుండ్రటి ఆకారంలో ఉంటాయి. కానీ సికిల్‌సెల్ వ్యాధి వచ్చిన వారిలో మాత్రం ఇవి కొడవలి ఆకారంలో ఉంటాయి. ఇవి శరీరమంతా వ్యాపించి పలు అనారోగ్యాలకు దారి తీసేలా చేస్తుంటాయి. పుట్టుకతోనే సోకే ఈ వ్యాధి జీవితాంతం వారిని వేధిస్తుంది. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్నారులు ఈ వ్యాధి కారణంగా ఏ పనీ చేతగాక నిస్సత్తువతో ఒకేచోట కుప్పకూలిపోతుంటారు. సమాజంలో అరుదైన ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 19న జాతీయ సికిల్‌సెల్ వ్యాధి అవగాహన దినం నిర్వహిస్తున్నారు.
ఎర్ర రక్తకణాలు గుండ్రంగా ఉండి మనిషి శరీరమంతా ప్రయాణించి వివిధ అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. కాగా కొంత మందిలో ఈ కణాలు కొడవలి ఆకారంలోకి మార్పు చెంది ఉంటాయి. దీనినే సికిల్‌సెల్ వ్యాధిగా వైద్యులు పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్న వారి రక్త కణంలోని ఒక జన్యువు సికిల్‌సెల్‌గా, మరొకటి మామూలుగా ఉంటే అలాంటి వారిని సికిల్‌సెల్ క్యారియర్లు ఉంటారు. వీరికి మామూలుగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే వివాహం చేసుకున్న దంపతులు ఇద్దరికీ ఇలాంటి లక్షణాలు ఉంటే వారికి జన్మించే పిల్లలకు రక్త కణంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి. అలాంటి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణ రక్తకణాల జీవిత కాలం 120 రోజులైతే సికిల్‌సెల్ రక్తకణాల జీవిత కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. ఇవి నశించి పోయేంత వేగంగా కొత్త ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు. అంతేగాక సికిల్ రక్తకణాలు వంపు తిరిగి ఉండటం వల్ల సన్నటి రక్తనాళాల్లో సరిగ్గా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సిజన్ అందడం తగ్గిపోతుంది. ఈ కారణంగా ఈ వ్యాధిగ్రస్తులు తగిన చికిత్స తీసుకోకపోతే 15 ఏళ్లలోపే మరణించే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు 40 మందికి పైగా ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన వ్యాధి ఉన్న వారికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి నెలా రూ.10 వేల ప్రత్యేక పెన్షన్ ఇచ్చి ఆదుకున్నారు.
వ్యాధి నిర్ధారణ పరీక్ష
ఈ వ్యాధి నిర్ధారణకు ప్రాథమిక రక్త పరీక్ష ఖరీదు తక్కువలోనే ఉంటుంది. రక్త నమూనాను సోడియం మెటాబైసల్ఫేట్‌లో కలిపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్తకణాలు గుండ్రంగా ఉన్నాయా? వంపు తిరిగి ఉన్నాయా తెలుసుకోవచ్చు. తద్వారా ఆ వ్యక్తికి సికిల్‌సెల్ వ్యాధి ఉందో లేదో నిర్ధారిస్తారు. జన్యుపరమైన ఈ వ్యాధికి ఇప్పటివరకు మందు లేదు. సికిల్‌సెల్ క్యారియర్లుగా గుర్తించి, వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగకుండా నియంత్రించవచ్చు.
గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి
తల్లిదండ్రుల్లో ఇద్దరికీ సికిల్‌సెల్ వ్యాధి ఉంటే వారికి పుట్టబోయే శిశువుకు సైతం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గర్భం దాల్చక ముందే పుట్టబోయే శిశువుకు ఈ వ్యాధి రాకుండా తల్లికి ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తాం. గర్భం దాల్చిన తర్వాత వస్తే బిడ్డకు వచ్చే అవకాశం ఉందా, లేదా అని తెలుసుకోవడానికి ఉమ్మనీరును పరీక్షకు పంపిస్తాం. ప్రసవం తర్వాత అయితే బిడ్డ కు పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తాం. ఈ వ్యాధి ఉంటే అవసరమైన చికిత్స అందిస్తాం. గర్భిణిగా ఉన్నప్పుడు సికిల్‌సెల్ ఉంటే నెలలు నిండకుముందే బిడ్డ జన్మించే అవకాశం ఉంది. దీనివల్ల శిశువు బరువు తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అబార్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
–డాక్టర్ టి.జ్యోత్స్న, గైనకాలజిస్టు, కర్నూలు
చిన్నారుల్లో అరుదైన రక్తవ్యాధి
పలు రకాల అనారోగ్య ఇబ్బందులు
పెన్షన్‌తో ఆదుకున్న గత ప్రభుత్వం
నేడు జాతీయ సికిల్‌సెల్ వ్యాధి అవగాహన దినం
వ్యాధి లక్షణాలు
†దీర్ఘకాలం పాటు కామెర్లు ఉంటాయి
†రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉండటం, కాళ్లు, చేతి వేళ్లు వాపుతో వంపు తిరిగి ఉండటం, ప్లీహం వాచిపోయి ఉండటం, నీరసం, తిమ్మిర్లు, డార్క్ ఐస్, చర్మం ముడ తలు పడటం వంటి లక్షణాలు ఉంటాయి
† శిశువుకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. వయస్సు పెరిగే కొద్దీ లక్షణాలు కనిపిస్తాయి.
† ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడంతో శరీరంలో ఏదైనా ఒక భాగంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
† కౌమార దశలో ఉన్నవారు, పెద్దవారు దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతూ ఉంటారు.