
ఆదోని ఎమ్మెల్యేపై ఫిర్యాదు
ఆస్పరి: ఆదోని మండలం ఢణాపురం గ్రామానికి చెందిన దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను అవమానించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ, మరి కొందరు అగ్రవర్ణాల వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆస్పరి గ్రామానికి చెందిన మూలింటి చంద్రశేఖర్ ఆస్పరి పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రాన్ని మహిళా కానిస్టేబుల్ లావణ్యకు అందజేశారు. ఈ సందర్భంగా మూలింటి చంద్రశేఖర్ మాట్లాడతూ ఈనెల 17వ తేదీన ఢణాపురం గ్రామానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మ వెళ్లి గ్రామంలోని ఆంజినేయ స్వామి గుడి కట్టపై సమావేశం నిర్వహించారు. అయితే సర్పంచ్ చంద్రశేఖర్ దళితుడని తెలుసుకున్న ఎమ్మెల్యే కట్టపైకి పిలవకుండా అమానించారని అవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సమక్షంలోనే దళిత ప్రజాప్రతినిధులకు అన్యాయం జరిగిందన్నారు. దళిత సర్పంచ్‌ను అమానించిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆస్పరి, చిగిళి, తొగలుగల్లు, బిల్లేకల్లు, అట్టెకల్లు , తంగరడోణ గ్రామాలకు చెందిన దళితులు పాల్గొన్నారు.