ముగిసిన చౌడేశ్వరిదేవి జ్యోతి బ్రహ్మోత్సవాలు

ఉత్సవ విగ్రహాలతో వసంతోత్సవం 
నిర్వహిస్తున్న భక్తులు  - Sakshi

బనగానపల్లెరూరల్‌: ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమైన నందవరం చౌడేశ్వరి దేవి జ్యోతి బ్రహ్మోత్సవాలు మంగళవారం వసంతోత్సవంతో ముగిశాయి. ఆలయ ఈఓ రామానుజన్‌, అర్చలకు ఆధ్వర్యంలో ఉదయం గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయంలోని శ్రీదేవి, భూ దేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రంగులు చల్లుకుంటూ చౌడేశ్వరిదేవి ఆలయానికి చేరుకున్నారు. అక్క డి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో భక్తు లు ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ దేవస్థానం సమీపంలోని శ్రీ చౌడమ్మ కోనేరు వద్ద కు తీసుకెళ్లారు. అక్కడ ఉత్సవ విగ్రహాలను కోనేటి నీటితో శుభ్రం చేసి మళ్లీ ఆయా దేవస్థానాలకు చేర్చి ఉత్సవాలను ముగించారు.

డిగ్రీ పరీక్షలకు

1240 మంది గైర్హాజరు

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షలకు మంగళవారం 1240 మంది గైర్హాజరయ్యారు. డిగ్రీ మొదటి, మూడు, ఐదవ సెమిస్టర్‌ పరీక్షలకు మొత్తం 13,896 మందికి 12,656 మంది హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ తెలిపారు. ఎమ్మిగనూరు రావూస్‌ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ముగ్గురు, కర్నూలు కర్నూలు డిగ్రీ కళాశాలలో ఇద్దరు, నంద్యాల పీఎస్‌సీ, కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆదోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల, డోన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎమ్మిగనూరు ఎస్‌ఎంఎల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్‌ చేసినట్లు తెలిపారు.

ఉపాధి వేతనం పెంపు

కర్నూలు(అగ్రికల్చర్‌): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీల వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉపాధి వేతనం గరిష్టంగా రూ.257 ఉంది. తాజాగా రూ.15 పెంచడం విశేషం. పెంపుదల వల్ల ఉపాధి కూలీల గరిష్ట వేతనం రూ.272కు చేరింది. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన వేతనం అమలులోకి వస్తుంది. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గరిష్ట వేతనం పొందడానికి ఉదయం, సాయంత్రం కూడా పనులు చేసుకునే అవకాశాన్ని జిల్లా నీటియాజమాన్య సంస్థ కల్పించింది. ప్రస్తుతం ఉపాధి పనులకు రోజుకు 80వేల మంది వరకు హాజరవుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎరువుల ప్రణాళికలుసిద్ధం చేయండి

కర్నూలు(అగ్రికల్చర్‌): 2023–24 సంవత్సరానికి అవసరమైన ఎరువులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి ఎరువుల కంపెనీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కర్నూలు సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో కంపెనీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో డీఏఓ మాట్లాడుతూ... 2022–23 సంవత్సరానికి డిమాండ్‌కు తగ్గట్టుగా ఎరువులు సరఫరా చేశారని, అదే తరహాలోనే వచ్చే సంవత్సరంలో కూడా ఎరువులు సరఫరా చేయాలని సూచించారు. ఇక నుంచి అన్ని కంపెనీలు, అన్ని రకాల ఎరువులను కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు భారత్‌ బ్రాండ్‌ పేరుతో సరఫరా చేయాలన్నారు. 100 శాతం ఎరువుల అమ్మకాలు ఈ–పాస్‌ ద్వారానే నిర్వహించాలన్నారు.

Read latest Nandyala News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top