
వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాల అపహరణ
నకిరేకల్: వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె మెడలోని బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకలపట్టణంలోని వీటీ కాలనీలో నివాసముంటున్న స్థానిక పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు తల్లి లక్ష్మమ్మ ఇంటికి శనివారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అద్దెకు రూములు కావాలంటూ వచ్చారు. తమ ఇంట్లో అద్దెకు రూములు లేవని లక్ష్మమ్మ వారికి చెప్పింది. తాగడానికి మంచినీళ్లు కావాలని సదరు వ్యక్తులు ఆమెను అడిగారు. దీంతో మంచినీళ్లు ఇచ్చేందుకు లక్ష్మమ్మ ఇంట్లోకి వెళ్తుండగా.. ఆమైపె ఆ ఇద్దరు వ్యక్తులు దాడి చేసి కాళ్లు, చేతులు కట్టివేశారు. లక్ష్మమ్మ కేకలు వేయడంతో ఆమె నోట్లో గుడ్డలు పెట్టి మొహంపై పిడుగుద్దులు గుద్దారు. అనంతరం ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసులు, చేతులకు ఉన్న వెండి గాజులు లాక్కోని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత లక్ష్మమ్మ చేతి కట్లు విప్పుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే ఆమె కూమారుడు వెంకటేశ్వరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ లచ్చిరెడ్డి తమ సిబ్బందితో లక్ష్మమ్మ ఇంటికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి క్లూస్‌టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల దాడిలో గాయపడిన లక్ష్మమ్మను నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మ మ్మను ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు.
వృద్ధ మహిళలే టార్గెట్..
వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తూ కొన్ని రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం నకిరేకల్ మండలం మర్రుర్ గ్రామంలో పుట్ట చంద్రమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి బయట కూర్చోని ఉండగా గుర్తుతెలియన ఇద్దరు యవకులు వచ్చి తన మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు అపహరించారు.