
విద్యుత్‌శాఖ ముందస్తు సన్నద్ధం
మిర్యాలగూడ అర్బన్ : విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేలా విద్యుత్‌శాఖ ముందస్తు మరమ్మతులు చేపడుతోంది. రాబోయే వర్షాకాలంలో విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికా బద్ధమైన విధానాల ద్వారా లోపాలను సరి చేస్తోంది. ప్రతీ వేసవి కాలంలో విద్యుత్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ప్రస్తుతం ట్రాన్స్‌కో అధికారుల ఆధ్వర్యంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ సబ్‌స్టేషన్ల వారీగా సరఫరా వ్యవస్థను మెరుగు పర్చుతున్నారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి.
జిల్లాలో 172 విద్యుత్ సబ్‌స్టేషన్లు..
జిల్లాలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 172 ఉండగా, 133 కేవీ సబ్‌స్టేషన్లు 16 ఉన్నాయి. ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఉండేలా అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు. లోపాలను తెలుసుకునేందుకు ఇప్పటికే పూర్తిస్థాయి సర్వే నిర్వహించిన అధికారులు ప్రస్తుతం వ్యవస్థ మెరుగుదలకు కసరత్తు చేపట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయా ప్రాంతాల సబ్‌స్టేషన్ల విద్యుత్ సిబ్బంది గ్రూపులుగా విడిపోయి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా విద్యుత్ సబ్‌స్టేషన్ల ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహణ వ్యవస్థను పర్యవేక్షిస్తుండగా ఈ నెల చివరి వరకు పనులు పూర్తి అవుతాయని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు.
నాణ్యమైన విద్యుత్ అందించేలా మరమ్మతులు
ఫ కరెంట్ తీగలను తాకుతున్న చెట్ల తొలగింపు
ఫ వేలాడుతున్న విద్యుత్ తీగల బిగింపు
ఫ శిథిలావస్థలో ఉన్న స్తంభాల మార్పు
ఫ వచ్చే వానాకాలంలో ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక
పకడ్బందీగా పనులు
అంతరాయం లేకుండా విద్యు త్ సరఫరా చేసేందుకు పకడ్బందీ పనులు చేపడుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపడుతూ లోపాలను సవరిస్తున్నాం. సిబ్బంది సమన్వయంతో పని చేస్తే విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా కరెంట్ అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాసచారి, ట్రాన్స్‌కో డీఈ, మిర్యాలగూడ
పాతవి తొలగించి.. కొత్తవి అమర్చుతూ..
విద్యుత్‌శాఖ ముందస్తు మరమ్మతుల్లో భాగంగా విద్యుత్ తీగలకు తగిలే చెట్టుకొమ్మలను తొలగిస్తున్నారు. వేలాడుతున్న విద్యుత్ తీగలను టైట్ చేస్తున్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని అమర్చుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిర్వహణ వ్వవస్థ మెరుగుదలకు అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. మరమ్మతులకు గురైన ప్యూజ్ బాక్స్‌లను తొలగించి కొత్త వాటిని అమర్చుతున్నారు. బలహీనంగా మారిన విద్యుత్ తీగల స్థానాల్లో సామర్థ్యం గల తీగలను బిగిస్తున్నారు.

విద్యుత్‌శాఖ ముందస్తు సన్నద్ధం

విద్యుత్‌శాఖ ముందస్తు సన్నద్ధం