61.35 శాతం మందికే! | - | Sakshi
Sakshi News home page

61.35 శాతం మందికే!

May 16 2025 1:51 AM | Updated on May 16 2025 1:51 AM

61.35 శాతం మందికే!

61.35 శాతం మందికే!

కార్డుదారులందరికీ అందని రేషన్‌ బియ్యం

ఎప్పుడూ రాని సమస్య ఇప్పుడే ఎందుకు?

పదేళ్ల నుంచి జిల్లాలో ధాన్యం అత్యధికంగా పండుతోంది. ఈ నాలుగైదేళ్లలో గణనీయంగా దిగుబడి పెరిగింది. ఇన్నేళ్ల కాలంలో ఏటా ఎంత ధాన్యం కొనుగోలు చేసినా, బియ్యం పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. జిల్లా యంత్రాంగానికి ధాన్యం ఎంత మార్కెట్‌కు వస్తుందన్న విషయం ముందుగానే తెలిసినా, ఇటు ధాన్యం లారీల కాంట్రాక్టు వ్యవహారంలో ఇష్టానుసారంగా వ్యవహరించడమే సమస్యకు కారణంగా తెలుస్తోంది. బియ్యం సరఫరాకు సరిపడా లారీలు ఉన్నాయా? లేదా? అనేది చూడకుండానే ధాన్యం సరఫరా కాంట్రాక్టు అప్పగించడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సన్న బియ్యం పంపిణీ సవాలక్ష్య సమస్యలతో సాగుతోంది. కార్డుదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ గడువు ఈనెల 15వ తేదీతో ముగిసినా పూర్తి స్థాయిలో గోదాముల నుంచి రేషన్‌ షాపులకు చేరలేదు. చేరిన బియ్యం కూడా ప్రజలకు ఇంకా పూర్తి స్థాయిలో అందనేలేదు. బుధవారం వరకు 61.35 శాతం కార్డుదారులకే రేషన్‌ బియ్యం అందినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంలో మొదటి నెల నుంచే ఇబ్బందులే ఎదురవుతున్నాయి.

రేషన్‌ పంపిణీ సమయం ముగిసినా..

ప్రతినెలా 30 తేదీ వరకే ఎఫ్‌సీఐ గోదాముల నుంచి బియ్యం రేషన్‌ షాపులకు చేరాలి. ఆ తరువాత ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ షాపు డీలర్లు బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయాలి. అయితే ఈ నెలకు సంబంధించి ఏప్రిల్‌ 30 నాటికే బియ్యం రేషన్‌ షాపులకు చేరాల్సి ఉండగా, మే 15వ తేదీ వచ్చినా కూడా ఇంకా రేషన్‌ షాపులకు పూర్తి స్థాయిలో బియ్యం చేరకపోవడంతో కార్డుదారులకు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు.

ముందుచూపులేని అధికారులు

జిల్లాలో ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అయితే రేషన్‌ బియ్యం సరఫరాకు, ధాన్యం సరఫరాకు సంబంధించి కాంట్రాక్టు పనులను అధికారులు ఒకరికే అప్పగించడం ఈ సమస్యకు కారణం అవుతోంది. ప్రతినెలా జిల్లాలో ప్రజలకు పంపిణీ చేసే దాదాపు 7 లక్షల మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాముల నుంచి రేషన్‌ షాపులకు పంపిణీ చేయాలి. ఈ పనులకు జిల్లాలో ఒక కాంట్రాక్టర్‌ నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే పనులను అధికారులు అదే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. బియ్యం పంపిణీలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాల్సిన అధికారులు చేతులెత్తేశారు. దీంతో 30వ తేదీ నాటికే షాపులకు చేరాల్సిన బియ్యం 15 రోజులు గడిచినా పూర్థిసాయిలో చేరలేదు.

సమన్వయ లోపం.. లారీల సమస్య

ఈ యాసంగి సీజన్‌లో 11,26,021 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 5,68,152 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొంటారని, మరో 5,57,869 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుందని సూచించింది. అయినా ఇటు పౌరసరఫరాల సంస్థ, అటు పౌరసరఫరాల శాఖ ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇప్పుడేమో బియ్యం పంపిణీకి ఉపయోగించే లారీలను కూడా ధాన్యం ట్రాన్స్‌ పోర్టుకు వినియోగిస్తున్నామని చెప్పి ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారు.

ధాన్యం విషయంలోనూ అదే దుస్థితి

కొనుగోలు కేంద్రాలకు లారీలు సకాలంలో రాక ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కో కేంద్రానికి మూడు నాలుగు రోజులకు కూడా ఒక లారీ రాని పరిస్థితి ఇటీవల సాక్షి నిర్వహించిన గ్రౌండ్‌ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఒక్కో కేంద్రానికి రెండు చొప్పున లారీలు పెట్టాల్సి ఉన్నా, అవసరం మేరకు పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. పైగా మిల్లర్లు ధాన్యం త్వరగా దింపుకోవడం లేదనే సాకును చెబుతున్నారు. అదే నిజమైతే మిల్లర్లు త్వరగా ధాన్యాన్ని దింపుకునేలా చర్యలు చేపట్టడంలోనూ అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి.

ఫ బియ్యం సరఫరాకు సరిపడా కేటాయించని లారీలు

ఫ పదిహేను రోజులు గడిచినా తప్పని ఎదురుచూపులు

ఫ ఇబ్బందుల్లో రేషన్‌ కార్డుదారులు

మండలాల సంఖ్య 33

రేషన్‌ షాపులు 950

కార్డుదారులు 4,74,681

లబ్ధిదారులు 13 లక్షలు

బుధవారం వరకు

బియ్యం తీసుకున్నవారు 2,91,233

రేషన్‌ అందని కార్డులు 1,83,448

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement