
కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
తిప్పర్తి: నల్లగొండ కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి నిరుద్యోగ యువతను మోసం చేసిన ఇద్దరు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఎండీ నసీర్ నల్లగొండ కోర్టులో అడ్వకేట్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. అదే కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న గాజుల జ్యోతి, నసీర్ కలిసి కోర్టుకు వచ్చే నిరుద్యోగ యువతకు కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి 31 మంది నుంచి రూ.10.32లక్షలు వసూలు చేశారు. తాను మోసపోయినట్లు గ్రహించిన తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందిన ఏపూరి హెబ్సిబా ఈ నెల 7వ తేదీన తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిపై ఫిర్యాదు చేసింది. శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందుతులిద్దరిని మంగళవారం అదుపులో తీసుకున్నారు. వీరిపై తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో 4 కేసులు, నల్లగొండ వన్‌టౌన్‌లో 3 కేసులు మొత్తం 7 కేసులు నమొదయ్యాయి. వీరి నుంచి 2 సెల్‌ఫోన్లు, బైక్, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, తిప్పర్తి ఎస్‌ఐ సాయిప్రశాంత్, పోలీస్ సిబ్బందిని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యక్రమంలో శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ సాయిప్రశాంత్, ఏఎస్‌ఐ లింగయ్య, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్‌రెడ్డి, రాజీవ్, రాంరెడ్డి, నాగరాజు, సూరిబాబు పాల్గొన్నారు.
ఇద్దరి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు