
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామ సమీపంలో 365వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు.. కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్‌ఎల్‌బీసీ కాలనీకి చెందిన మాదగాని లోకేశ్(24), కట్టంగూర్ మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దోనిబావి గ్రామానికి చెందిన రాచకొండ నిఖిల్(21) స్నేహితులు. లోకేశ్ ఐటీఐ పూర్తిచేసి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తయారుచేసే కంపెనీలో అంప్రెంటీస్ చేస్తున్నాడు. నిఖిల్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. లోకేశ్ మంగళవారం హైదరాబాద్ నుంచి బైక్‌పై పెద్దోనిబావి గ్రామానికి వచ్చి నిఖిల్‌ను పిలుచుకొని నకిరేకల్ మీదుగా 365వ నంబర్ జాతీయ రహదారిపై అర్వపల్లి వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకేశ్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న రాచకొండ నిఖిల్‌కు తీవ్రగాయాలు కావడంతో పాటు కారును నడుపుతున్న మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన దేశగాని విఠల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిఖిల్, విఠల్‌ను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని, మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు.
ఇద్దరు యువకులు దుర్మరణం

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు