
తాటిచెట్టు పైనుంచి పడి గాయాలు
మునగాల: కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మునగాల మండలం నారాయణగూడెంలో జరిగింది. వివరాలు.. నారాయణగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు కాసాని వెంకటేశ్వర్లు తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. మోకు తెగిపోయి చెట్టు పైనుంచి కిందపడ్డాడు. అతడి కుడి కాలు విరగగా, తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వెంకటేశ్వర్లును ఆటోలో కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌కు తరలించారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి ప్రభుత్వం, తోడ్పాటునివ్వాలని గ్రామస్తులు కోరతున్నారు.
రసాయన వ్యర్థాల శాంపిల్స్ సేకరణ
చివ్వెంల(సూర్యాపేట): లారీల్లో రసాయనిక వ్యర్థాలు తీసుకొచ్చి సోమవారం రాత్రి చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన రహదారి పక్కన వదిలిపెట్టారు. మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రోడ్డు పక్కన పారబోసిన రసాయనిక వ్యర్థాల శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వ్యర్థాలు వదిలిన లారీలను స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.