
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అనర్హుడు
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అనర్హుడని, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం సూర్యాపేటలో జగదీష్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలన చేతకాని రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంగా ఏర్పడినప్పుడే తెలంగాణ అప్పులతో మొదలైందని, అయినా పదేండ్లు కేసీఆర్ చేసిన అభివృద్ధి పాలన చూడలేదా అని అన్నారు. ఆదాయ వ్యయాల్లో కేసీఆర్‌కు, రేవంత్ కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. రేవంత్ మాట్లాడిన ప్రతిమాట అబద్దమని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని బట్టే కేసీఆర్ హామీలిచ్చారని చెప్పారు. రేవంత్‌రెడ్డి అడ్డగోలు హామీలిచ్చి అమలు చేతకాక ఇప్పుడు చేతులెత్తేసిండని విమర్శించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. గాలిమోటర్లో తిరిగి.. అప్పులు పుడతలేవంటున్నరని, సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తుందని చెప్పారు. హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి