
ఇళ్ల నిర్మాణంపై శ్రద్ధ చూపాలి
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాలకు కనీసం 500 ఇళ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాబితాలో ఎవరైనా అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేస్తామన్నారు. లిస్ట్–1, లిస్ట్–2, లిస్ట్–3 లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలన్నారు. పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 31వ తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్‌కుమార్, అదనపు ఎస్పీ రమేష్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి