
కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల్లో సామాజిక నేపథ్యాల కారణంగా కులాల రిజర్వేషన్ అమల్లో ఉందని, ఈ అంతరాన్ని ఎలా తొలగిస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. ముందుగా కుల గణన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. గురువారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన అమలు చేస్తామని హామీనిచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల విషయంలో సవతి తల్లి ప్రేమను చూపుతోందన్నారు.
సోనియా లేకుండా తెలంగాణ వచ్చేది కాదు..
తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం అర్థరహితమన్నారు. కేసీఆర్ స్వయంగా ఎన్నోసార్లు సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ పోరాటాన్ని కూడా కాదనలేమన్నారు. అందుకే ప్రజలు పదేళ్లు అధికారాన్ని కూడా ఇచ్చారన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో కేసీఆర్ పాత్ర, సోనియాగాంధీ పాత్ర, సుష్మా స్వరాజ్ పాత్రను విస్మరించలేమన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ పూర్తవుతుంది..
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి అనుమానం వద్దని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో పూర్తవుతుందన్నారు. టన్నెల్ ప్రమాదం వల్ల కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని కానీ, ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిపుణులు ఏవిధంగా పూర్తి చేయాలనేది చెప్పాల్సి ఉందన్నారు. వెలుపలి నుంచి ప్రాజెక్టు చేపడితే పర్యావరణ అనుమతులు అవసరం కాబట్టి కేంద్ర సహకారం కూడా ప్రాజెక్టు పూర్తి అవసరం ఉందని గుత్తా చెప్పుకొచ్చారు.
ఏఎమ్మార్పీ కాలువ పెంచాలి..
ఏఎమ్మార్పీ హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ.442 కోట్లు ఇచ్చిందని సుఖేందర్‌రెడ్డి చెప్పారు. కెనాల్‌లో 4వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుందని, లైనింగ్ పనులు పూర్తయితే పెరుగుతుందన్నారు. కాబట్టి కాలువును రెండు మీటర్ల వెడల్పు పెంచి లైనింగ్ పనులు చేస్తే మేలు జరుగుతుందని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ ఆలోచించాలన్నారు.
తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ అనడం సరైంది కాదు
శాసనమండలి చైర్మన్
గుత్తా సుఖేందర్‌రెడ్డి
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి
పాకిస్తాన్‌తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రథమ కర్తవ్యమని సుఖేందర్‌రెడ్డి అన్నారు. పాకిస్తాన్ తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులను అప్పగిస్తే కొంతవరకు ఉద్రిక్తతను అరికట్టవచ్చన్నారు. పాకిస్తాన్ మంత్రుల ప్రకటనలను చూస్తే పరిష్కారం దిశగా లేవని కవింపు చర్యలుగా ఉన్నాయని గుత్తా పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి, ఉగ్రవాద దేశంగా పేరుపడిన పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటే తన చావును తాను కొని తెచ్చుకోవడమేనని అన్నారు.