
బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు
కొండమల్లేపల్లి: సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో అప్పడాల బిజినెస్ పేరిట ఓ మహిళ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలంలోని చేపూరు గ్రామానికి చెందిన కోరె సరళ మదర్ థెరిస్సా సమైక్య ట్రస్ట్ పేరుతో ఉపాధి కల్పిస్తామని చెప్పి కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ప్రచారం నిర్వహించింది. ఒక్కో మహిళకు కేజీ పిండి ఇస్తామని, వాటిని అప్పడాలుగా తయారు చేస్తే ఒక్కో ప్యాకెట్‌ను రూ.10 చొప్పున ఇస్తానని మహిళలకు మాయమాటలు చెప్పింది. మొదటగా రూ.500 కడితే ట్రస్ట్‌లో సభ్యత్వం వస్తుందని చెప్పగా, సుమారు 50మంది వరకు రూ.500 చొప్పున చెల్లించారు. ఆ 50మంది అప్పడాలు తయారుచేసి ఇవ్వగా, వారికి డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు బాధితుల నుంచి వివరాలు సేకరించి, సరళను విచారించగా డబ్బులు తిరిగి చెల్లిస్తానని పేర్కొన్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.
ఫ 50 మంది నుంచి రూ.500 చొప్పున వసూలు చేసిన మహిళ