
సంఘటనా స్థలంలో ద్విచక్ర వాహనం, ట్రాక్టర్
పాలకవీడు: ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ద్విచక్ర వాహనంపై బోల్తా పడడంతో వాహనదారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలంలోని యల్లాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాక్టర్‌లో ధాన్యం లోడుతో నేరేడుచర్ల వైపు వస్తున్నాడు. అదే సమయంలో హనుమయ్యగూడెం గ్రామానికి చెందిన గజ్జల భగవంతరెడ్డి నేరేడుచర్ల నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో గుడుగుంట్లపాలెం గ్రామంలోని మూలమలుపు వద్దకు రాగానే ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న భగవంతరెడ్డిపై బోల్తా పడింది. దీంతో భగవంతరెడ్డి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న గుడుగుంట్లపాలెం గ్రామ సర్పంచ్ కిష్టిపాటి అంజిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి సీపీఆర్ చేసి శ్వాస అందించారు. 108 వాహనానికి సమాచారం అందించగా, అది రావడం ఆలస్యం కావడంతో ఆటోలో మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం భగవంతరెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై సైదులు తెలిపారు.
ఫ అపస్మారకస్థితిలోకి వెళ్లిన
వాహనదారుడు
ఫ మెరుగైన చికిత్స నిమిత్తం
హైదరాబాద్‌కు తరలింపు