అమ్రాబాద్: మండలంలోని రాయలగండి క్షేత్రంలో మంగళవారం శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. ముందుగా భజన బృందాలతో అచ్చంపేట నుంచి తలంబ్రాల రథాన్ని రాయలగండి క్షేత్రానికి తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లకు ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, ఆయన సతీమణి డా.అనురాధ పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. కల్యాణ తంతును శాస్త్రోక్తంగా జరిపించారు. ఆనాయితీ ప్రకారం అచ్చంపేట మాల ఉద్యోగుల సంఘంతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు తలంబ్రాలు తీసుకువచ్చారు. స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించి తన్మయం పొందారు. ఉత్సవాల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ మాలల ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. అనంతరం రాష్ట్రస్థాయి వాలీబాల్, కోలాటం పోటీలను ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నరహరి, ఆనంద్, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, బూర్గుల వెంకటేశ్వర్లు, మందాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.