మన్ననూర్: రాష్ట్ర అటవీ శాఖ అమ్రాబాద్ టైగర్ రిజర్వును ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చడం వల్ల నల్లమల ప్రాంతం వన్యప్రాణులకు స్వర్గధామంగా మారిందని డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం మన్ననూర్‌లోని ఈసీ సెంటర్ వద్ద వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ, వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములుగా ఉన్న ఆయా గ్రామాలు, పెంటలు, గూడేలలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. సున్నితమైన పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి కొత్తగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నల్లమల, కృష్ణానది పరివాహక ప్రాంతాలతోపాటు శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో సైతం ప్లాస్టిక్‌ను నిషేధించడం శుభపరిణామం అన్నారు. అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధికి గాను రిసార్టులు, కాగితం పరిశ్రమ, జనపనార ఉత్పత్తులు వంటివి ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు తెలిపేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం పురోగతి సాధించేదిగా కూడా ఉందన్నారు. ఈ సమాచారాన్ని తెలియజేసే అంశాలను ప్రజల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.