
పారా లీగల్ వలంటీర్లకు అవగాహన
నాగర్‌కర్నూల్ క్రైం: పారా లీగల్ వలంటీర్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరఫున ప్రజలకు చట్టాలు, న్యాయ సేవలపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమం శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రజలు ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తానా మాట్లాడుతూ.. పారా లీగల్ వలంటీర్లు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే సంస్థ దృష్టికి తీసుకురావాలని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో చదివేలా కృషి చేయాలన్నారు. న్యాయ సలహాలు, సూచనల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 15100కు సంప్రదించాలని సూచించారు.