
సీఎం పర్యటనలో నిబంధనల మేరకే అనుమతులు
మన్ననూర్: ఇందిర సౌర గిరి జల వికాసం పథకం పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లమలకు వస్తున్నారని.. ప్రొటోకాల్ నిబంధనలు అమలులో ఉన్నందున ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ కోరారు. శనివారం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి పరిశీలించారు. బహిరంగసభ వేదిక, హెలిప్యాడ్, పైలాన్, సీఎం ప్రారంభించనున్న బోరుబావి, సోలార్, పండ్ల మొక్కలను ఒక్కొక్కటిగా పరిశీలన చేశారు. సోమవారం ఉదయం 11 గంటల వరకు సీఎం మాచారం గ్రామానికి చేరుకోనున్నందున కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి వినతి పత్రాలు, ఫిర్యాదులు ఇచ్చేందుకు అవకాశం లేదని కలెక్టర్ సంతోష్ సూచించారు. సీఎం కాన్వాయితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే పరిమితంగా అవకాశం కల్పిస్తున్నామని.. ప్రజాప్రతినిధులు, నాయకులు ఇతరులకు అనుమతి ఉండదని ఎస్పీ వివరించారు. పథకం ప్రారంభోత్సవానికి అధికారులు నిర్దేశించిన ప్రదేశాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందన్నారు. సీఎం పర్యటించే ప్రదేశాలను భద్రతా బలగాల పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలను డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
తాడూర్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణను ఆయన పరిశీలించి మాట్లాడారు. అనుభవజ్ఞులైన శిక్షకులతో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పిల్లలు ఎలా నేర్చుకుంటారో తెలుసుకోవడం ముఖ్యమన్నారు. గుణాత్మక శిక్షణ మూడు విడతల్లో ఉంటుందని తెలిపారు. అనంతరం పదోతరగతిలో 530 మార్కులు సాధించిన పుష్ప, సునీతను సన్మానించి అభినందించి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. సమావేశంలో వెంకటయ్య, ఎంపీడీఓ ఆంజనేయులు, మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మహముద్ అలీ తదితరులు పాల్గొన్నారు.