
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గద్వాల, వనపర్తి, పెబ్బేరు, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాలలో కుటుంబసభ్యులతో వచ్చి మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు నైవేద్యం సిద్ధం చేసి మొక్కులు తీర్చుకున్నారు. మొత్తం 5వేల మంది దర్శించుకోగా.. వనపర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను భక్తుల సౌకర్యం కోసం నడిపించారు.
ఢిల్లీ, హర్యానా పర్యటనకు పీజీ విద్యార్థులు
కొల్లాపూర్: స్థానిక ప్రభుత్వ పీజీ కళాశాల విద్యార్థులు ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మార్క్‌పోలోనియస్ వెల్లడించారు. సోమవారం ఉదయం ఎంఎస్‌డబ్ల్యూ కోర్సు చదువుతున్న విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఢిల్లీ బయలుదేరుతారని ఆయన తెలిపారు. 19వ తేదీ వరకు ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో విద్యార్థులు పర్యటించి అక్కడి సామాజిక స్థితిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక, రాజకీయ, అభివృద్ధి అంశాలను పరిశీలిస్తారన్నారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకుగాను ఎర్త్ సేవియర్ సంస్థ సహకారంతో ఈ పర్యటన ఏర్పాటుచేశామని, ఎంఎస్‌డబ్ల్యూ అధ్యాపకుడు దేవరాజ్ పర్యవేక్షిస్తారన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,451
కల్వకుర్తి రూరల్: స్థానిక మార్కెట్ యార్డులో వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,451, కనిష్టం రూ.5526, సరాసరి రూ.6612 ధర పలికింది. ఆదివారం మార్కెట్‌కు 155 మంది రైతులు 1,389 క్వింటాళ్ల వేరుశనగను విక్రయానికి తీసుకువచ్చారు.
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా కారంగి బ్రహ్మయ్య
నాగర్‌కర్నూల్ రూరల్: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా కారంగి బ్రహ్మయ్యను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం నియామకపత్రం జారీ చేసినట్లు తెలిపారు. బ్రహ్మయ్య కొల్లాపూర్ అసెంబ్లీ పెంట్లవెళ్లి వాస్తవ్యులు కాగా వృత్తిరిత్యా ఆర్‌ఎంపీ డాక్టర్‌గా కొనసాగుతున్నారు. గతంలో స్వేరోస్ నెట్‌వర్క్‌లో పనిచేశారని ఆ పార్టీ నా యకులు తెలిపారు. గతంలో పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన కొత్తపల్లి కుమార్‌ను నాగర్‌కర్నూల్ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా నియమించి పూర్తి బాధ్య తలు అప్పజెప్పారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలంగా చేయాలని తెలిపినట్లు కుమార్ తెలిపారు.
పేదలకు అండగా ఉంటాం..
లింగాల: ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందించు.. సాయం అందించు కార్యక్రమంలో మానవతా దృక్పథంతో పోగు చేసిన రూ.6 లక్షలను నిరుపేదలకు, విద్యార్థులకు ఖర్చు చేయడం జరుగుతుందని ఆర్డీటీ ఏరియా టీం లీడర్ రాధ తెలిపారు. ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్నిసెంట్ ఫెర్రర్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏడాది కాలం నుంచి లింగాల, బల్మూర్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాలలోని 43 గ్రామాల్లో దాతలు పోగు చేసిన హుండీలను పరిశీలించారు. మొత్తం రూ.6 లక్షల వరకు జమ అయినట్లు, ఈ మొత్తాన్ని నిరుపేద కుటుంబాలకు, విద్యార్థులకు అందించి ఆదుకుంటామన్నారు.

