
అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు
నాగర్‌కర్నూల్ రూరల్: మన్ననూరులోని గురుకుల బాలికల పాఠశాల/ కళాశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని మృతి ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి పిల్లలను తల్లిదండ్రులు పంపిస్తే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సి వస్తుందని ఆరోపించారు. ఇప్పటికై నా నిఖిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు డీహెచ్‌పీఎస్ లక్ష్మీపతి, శివకృష్ణ, శివశంకర్, వరుణ్, శివ, రాజు, నందు, చందు, శివకుమార్, మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.