కల్వకుర్తి టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సెమిస్టర్–2, 4, 6 పరీక్షల ఫీజు చెల్లించాలని కల్వకుర్తి స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 31వ తేదీలోగా మీసేవ కేంద్రం లేదా ఆన్‌లైన్ సెంటర్లలో ఫీజు చెల్లించి.. హాల్‌టికెట్లు పొందాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 73829 29720, 91775 97740 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
ఆక్రమణల కూల్చివేత
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను బుధవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి పెల్లారెడ్డి ఆస్పత్రి రోడ్డు వరకు కొందరు దుకాణదారులు, చిరువ్యాపారులు ప్రధాన రహదారిని ఆక్రమించి షెడ్లు, మెట్లు నిర్మించుకోగా.. పోలీసు బందోబస్తు నడుమ వాటిని తొలగించారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల అధికారులతో చిరువ్యాపారులు వాగ్వాదానికి దిగారు. అయితే ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే కూల్చివేస్తున్నామని అఽధికారులు చెప్పారు. వ్యాపారులకు పోలీసులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ప్రధాన రహదారితో పాటు శ్రీపురం రోడ్డు, నల్లవెల్లి రోడ్డులో కూడా ఆక్రమణల తొలగింపు చేపట్టనున్నట్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వికాస్ తెలిపారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలతో పాటు ఇంటి అనుమతులు తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు చేపట్టిన వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
తాడూర్: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి నసీం సుల్తానా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. ప్రతి కేంద్రంలో తప్పనిసరిగా ఆట వస్తువులతో పాటు ఫ్యాన్లు, బాత్‌రూంలు ఉండాలని న్యాయమూర్తి సూచించారు. అదే విధంగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. న్యాయమూర్తి వెంట ఐసీడీఎస్ సీడీపీఓ దమయంతి, ఎస్‌ఐ గురుస్వామి, వనజ, కార్యదర్శి పవన్‌కుమార్, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.

ఓపెన్ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించండి