
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
వంగూరు/మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 18న జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం పర్యటన ఏర్పాట్లను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా సీఎం స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి.. సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లిలో దాదాపు రూ. 50కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, మిషన్ భగీరథ అధికారులు అభివృద్ధి పనులను పూర్తిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీశైలం హైవే నుంచి గ్రామం వరకు నాలుగు లెన్ల రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైయినేజీ, సీసీరోడ్లు, సోలార్ విద్యుత్ సౌకర్యం తదితర పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా హెలీప్యాడ్ సమీపంలో బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం అమ్రాబాద్ మండలం మాచారంలో సీఎం సభా స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభిస్తారని.. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామపెద్ద జలంధర్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ రోహిత్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బోరుబావులు, సౌరశక్తి పలకల ఏర్పా ట్లు, పండ్ల మొక్కల నాటడం, హెలీప్యాడ్‌ను పరిశీలించారు. సీఎం హోదాలో మొదటిసారిగా నల్లమలకు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పా టు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. వారి వెంట వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ దేశ్యానాయక్, డీఈ నాగలక్ష్మి, పంచాయతీరాజ్ డీఈ చంద్రకళ, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్, తహసీల్దార్ శైలేంద్ర, ఎంపీడీఓలు వెంకటయ్య, జగదీశ్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ బదావత్ సంతోష్
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
ఏర్పాట్ల పరిశీలన