
నేటినుంచి డిగ్రీ పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలు పలు కారణాలతో రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో ఏబీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల్లో 2, 4, 6 సెమిస్టర్లతోపాటు పలు సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణకు అధికారులు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని కేంద్రాలకు మెటీరియల్ చేరుకుంది.
సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 47 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా ఇందులో 17 ప్రభుత్వ.. 30 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సెమిస్టర్–2లో 16,073 మంది విద్యార్థులు, సెమిస్టర్– 6లో 13,787 మంది, సెమిస్టర్–4లో 9,240 మంది విద్యార్థులు కలిపి మొత్తం 39,100 మంది పరీక్ష రాయనున్నారు. 9 రూట్లలో ఫ్లయింగ్ స్క్వాడ్, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించారు. మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.
రెండుసార్లు వాయిదాల తర్వాత
ఎట్టకేలకు ప్రారంభం
47 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 39,100 మంది విద్యార్థులు
ఏర్పాట్లు పూర్తిచేశాం..
పీయూ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వి ద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా కాపీయింగ్ తావు లేకుండా పకడ్బందీగా, పాదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్‌లర్