
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
● జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవరావు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవరావు అన్నారు. మండల కేంద్రంతో పాటు నార్లాపూర్‌లోని రైతు వేదికల్లో ఉద్యాన శాఖ, కేఎన్ బయోసైన్స్ ఆయిల్‌పామ్ కంపెనీ వారి అనుబంధంతో రైతులకు మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సరిపడా నూనె ఉత్పత్తి లేదని తెలిపారు. దేశంలో 259 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ వినియోగం అవసరం కాగా 97లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దీంతో ఇతర దేశాల నుంచి నూనె దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఇతర దేశాల నుంచి దిగుమతి తగ్గించి మన రైతులు ఆయిల్‌పామ్ పంటల సాగుపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. అదే విధంగా రైతులు పండ్లు, కూరగాయలు సాగుచేయాలని సూచించారు. ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి శ్రీకాంత్, ఆయిల్ పామ్ కంపెనీ ఏరియా మేనేజర్ హేమంత్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అనిరుద్, ఏఈఓలు రాజ్‌కుమార్, దుర్గాప్రసాద్‌లు పాల్గొన్నారు.