
బుల్లితెర ప్రేక్షకుల ఎదురుచూపులకు శుభం కార్డు పడనుంది. తెలుగు బిగ్‌బాస్ 9 షో (Bigg Boss 9 Telugu) కి రంగం సిద్ధమైంది. వచ్చేవారమే బిగ్‌బాస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ 9 ప్రారంభం కాబోతుందని ప్రకటించింది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే ఈ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. 9వ సీజన్ కావడంతో ప్రోమోలో నవగ్రహాలను చూపించారు. అలాగే ఈసారి రెండు హౌస్‌లు ఉంటాయన్నారు. ఒకటి సెలబ్రిటీల కోసం.. మరొకటి కామన్ మ్యాన్ కోసం అని తెలుస్తోంది. అలాగే బిగ్‌బాస్‌నే మారుస్తున్నట్లు చెప్పాడు నాగ్. అంటే బిగ్‌బాస్ వాయిస్ మారొచ్చని తెలుస్తోంది.
అగ్నిపరీక్ష
ఇప్పటికే కామన్ మ్యాన్ కోసం సెలక్షన్ జరుగుతోంది. హాట్‌స్టార్‌లో అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు 15 మంది సెలక్టయ్యారు. వారికి రకరకాల గేమ్స్ పెడుతున్నారు. నచ్చినవారికి ఓట్లేసుకోమని ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓట్లు ఎక్కువ వచ్చిన ఒకరిద్దరు కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించవచ్చని తెలుస్తోంది. అలాగే అగ్నిపరీక్ష షో జడ్జిలైన బిందు మాధవి, నవదీప్, అభిజిత్.. ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్లను సెలక్ట్ చేసి డైరెక్ట్‌గా పంపించవచ్చని భోగట్టా! మరి హౌస్‌లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే వచ్చేవారం దాకా ఆగాల్సిందే!