
ఓటీటీ ఇది చూడొచ్చు
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో అరేబియా కడలి సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో కష్టాల్లేని మనుషులు ఉండరు. లేనివాడైనా, ఉన్నవాడికైనా కష్టమనేది ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని జీవించగలిగినవాడే హీరో. అలాంటి హీరోలను వెండితెర మీద మనం ఇప్పటికే ఎన్నోసార్లు చూసుంటాం, చూస్తున్నాం... అలాగే చూడబోతున్నాం. నిజానికి ఆ వెండితెర మీద హీరో పడే కష్టం మన జీవితాల నుండి తీసుకున్నదే.
వెండితెర మీద హీరో పాత్రధారి తన కష్టాన్ని ఎదుర్కోవడం రెండు గంటలకు పైగా మన నిజమైన కష్టాన్ని మరిచి ఆనందంగా చూడడమే విడ్డూరం. అలాంటి కొందరి కష్టాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపే ప్రయత్నం చేశారు ‘అరేబియా కడలి’ అనే సీరీస్ ద్వారా. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అందించిన రచనకు దర్శకుడు వీవీ సూర్యకుమార్ తీర్చిదిద్దిన కళా కష్టమే ఈ ‘అరేబియా కడలి’.
నేటి మేటి విలక్షణ కథానాయకుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో అలరించగా మరో పాత్రకు వర్ధమాన నటి ఆనంది ప్రాణం పోశారు. అంతలా ఆ కష్టం కథేంటో ఓసారి చూద్దాం. ముఖ్యంగా ఇది తీర ప్రాంతాలకు సంబంధించిన జాలర్ల కథ. సముద్రంలోకి తమ ప్రాణాలు పణంగా పెట్టి రోజుల తరబడి చేపల వేటకు వెళ్ళే జాలరుల కష్టాల ప్రతిరూపమే ఈ కథ. సముద్ర తీర ప్రాంతాలలో దగ్గరగా ఉన్న రెండు జాలర్ల గ్రామాలకు ఓ కారణంతో అస్సలు పడదు. కానీ మరో కారణంతో ఆ రెండూళ్ళ నుండి ఒకే పడవలో జాలర్లు వేటకు వెళ్ళవలసి వస్తుంది.
అలా వెళ్ళిన ఆ ఓడ తుఫాను కారణంగా పాకిస్తాన్ తీర ప్రాంతానికి చేరుతుంది. అక్కడ ఈ జాలర్లందరినీ పాకిస్తాన్ దేశం బంధించి నానా హింసలు పెడుతుంది. మరి... వారి ఊళ్ళలోనే కలవని వీళ్ళు పరాయి దేశంలో బందీలై తిరిగి భారతదేశానికి వస్తారా? లేదా అన్నది సిరీస్‌లోనే చూడాలి. మొత్తం 8 ఎపిసోడ్లతో కథాంశం పక్కకి పోకుండా ఎంతో చక్కగా తీశారు దర్శకుడు. సముద్రంలో అల ఎంత ఉవ్వెత్తున ఎగసిపడుతుందో అంతకు మించి మనలోని కష్టం మన భావావేశాలను ప్రతిబింబిస్తుంది అని నొక్కి చెప్పే సన్నివేశాలు ఈ సిరీస్‌లో మెండుగా ఉన్నాయి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ మంచి కాలక్షేపం.
– హరికృష్ణ ఇంటూరు