
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన అమ్మగారు, దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వృద్ధాప్య కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె కన్నుమూశారు. నేడు మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ముంబై నుంచి, రామ్ చరణ్ మైసూర్ నుంచి ప్రయాణమయ్యారు. వారిద్దరూ కూడా మధ్యాహ్నంలోపు హైదరాబాద్ చేరుకుంటారు. ఇప్పటికే చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మాత్రం అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా అరవింద్ ఇంటికి వెళ్తున్నారు.

అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు నలుగురు సంతానం ఉన్నారనే విషయం తెలిసిందే. వారిలో అల్లు అరవింద్, కుమార్తె సురేఖ మాత్రమే సినీ ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారు. వారి పిల్లలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ రేంజ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య 2004లో మరణించారు. అయితే, ఆయన సతీమణి కనకరత్నం మీడియాకి పెద్దగా కనిపించరు. తన భర్త అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో మాత్రమే ఆమె కనిపించారు. ఆ తర్వాత పుష్ప సినిమా సమయంలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చిన తర్వాత బన్నీకి నాన్నమ్మే దిష్టి తీసింది. ఆ సమయంలో ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
ఆమె మాకు ఆదర్శం: చిరంజీవి
మా అత్తయ్య గారు.. దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరమని చిరంజీవి అన్నారు. ఇరు కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ తమకు ఆదర్శంగా ఉంటాయని చెప్పారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ సోషల్‌మీడియాలో చిరంజీవి పంచుకున్నారు.