
టెన్త్, ఇంటర్‌పై ప్రత్యేక దృష్టి
ఫలితాల్లో ఈసారి మొదటి స్థానం దక్కాలి
● ఆ దిశగా విద్యాబోధన సాగాలి ● ఎన్‌రోల్‌మెంట్ పెంచాలి ● కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: ఈసారి పది, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాకు మొదటి స్థానం రావాలని, ఆ దిశగా విద్యాబోధన సాగాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నమోదు సంఖ్య పెంచాలన్నారు. అలాగే డ్రాపౌట్ సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల నమోదును పెంచుతూ డ్రాపౌట్స్ కారణాలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడం, డ్రాపౌట్స్‌పై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు మరింత మెరుగుపడే దిశగా కృషి చేయాలన్నారు. కష్టమైన సబ్జెక్టులపై, విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. పది పాసైన విద్యార్థులను ఇంటర్‌లో చేరేలా, ఇంటర్ పాసైన వారిని డిగ్రీలో తప్పనిసరిగా చేరేలా కృషి చేయాలన్నారు. ఇందుకోసం పటిష్ట కార్యాచరణ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు, సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థికి చదువు ప్రాముఖ్యత తెలియజెప్పాలన్నారు. గ్రామీణ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందించాలన్నారు. సమావేశంలో డీఈఓ రాధాకిషన్, ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి, నోడల్ అధికారులు ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఇరిగేషన్ అదనపు ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రప్రసాద్ కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.