
సర్కార్ బడికే సై..
బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు చేసిన ప్రచారం ఫలించింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 834 మంది పిల్లలు అధికంగా చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 926 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక, యూపీఎస్, ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. కాగా వీటిలో గత సంవత్సరం బడిబాటలో భాగంగా 4,908 పిల్లలు చేరగా, ఈ ఏడాది 5,742 మంది పిల్లలు కొత్తగా చేరారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 74,529లకు చేరింది. కాగా ఏటా జూన్‌లో 15 రోజుల పాటు బడిబాట కార్యక్రమం నిర్వహించేది. ఈసారి మాత్రం ముందస్తుగా ఉపాధ్యాయులు మే నెలలోనే నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారి కృషి ఫలితంగా ఈ సారి విద్యార్థుల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
టీచర్ల పిల్లలు సైతం..
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే 25 మంది ఉపాధ్యాయులు వారి పిల్లలను స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మార్పుకు నాంధి పలికారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న పేద, మధ్య తరగతి వారు సైతం వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లోకి పంపుతున్నారు. ప్రభుత్వ టీచర్లు వారి పిల్లలను సర్కారు బడుల్లోనే చదివించాలనే నిబంధన తీసుకొస్తే పేద, మధ్య తరగతి వారంతా వారి పిల్లలను ప్రైవేట్‌కు పంపకుండా సర్కార్ బడులకే పంపిస్తారని పలువురు పేర్కొంటున్నారు.
సత్ఫలితాలిచ్చిన బడిబాట
గతేడాది కంటే పెరిగిన విద్యార్థుల సంఖ్య
ఈ ఏడాది 5,742 మంది చేరిక