
మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు
కలెక్టర్ రాహుల్‌రాజ్
నర్సాపూర్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కార్యక్రమాలతో పాటు పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం ఉదయం మున్సిపల్ అధికారులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సానిటేషన్, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు. పట్టణ ప్రజలు బాధ్యతగా మెలిగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తమ సిబ్బందితో భాగస్వాములు కావాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి అందజేయాలని వ్యాపారులకు సూచించారు. పట్టణంలోని ప్రతి ఇంటి వద్దకు చెత్త సేకరించే వాహనం వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. నిలువ ఉన్న నీటిని ఇంటి యజమానులతో కలిసి కలెక్టర్ పారబోశారు. నర్సాపూర్‌ను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరు సహకరించాలన్నారు. అనంతరం కోమటికుంటను పరిశీలించారు. కుంట పరిసరాల్లో చెత్త పారవేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదే శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, నిబంధనల మేరకు పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్‌రెడ్డి, మేనేజర్ మధుసూదన్, ఆర్‌ఐ ఫైజల్, ఇతర అధికారులు ఉన్నారు.