
జీతం.. మహాప్రభో..
● కాంట్రాక్టు వైద్యులకు మూడు నెలలుగా వేతనాలు కరువు
● జిల్లావ్యాప్తంగా 15 మంది ఎదురుచూపు
మెదక్‌జోన్: కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తించే వైద్యులకు మూడు నెలలుగా వేతనాలు అందలేదు. అలాగే విధుల్లో చేరి ఏడాది గడిచినా రెన్యూవల్ చేయలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో గతే డాది ఏప్రిల్‌లో 15 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిన విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కాగా వీరికి ఈ ఏడాది మార్చి వరకు మాత్రమే వేతనాలు అందాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన జీతం రాలేదు. అంతేకాకుండా కాంట్రాక్టు పద్ధతిన నియమించిన ఉద్యోగులను ఏడాదికోసారి రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. అయితే గడువు దాటిపోయి మూడు నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు కాల పరిమితి ఏడాది మాత్రమే కావటంతో రెన్యూవల్ చేస్తేనే వీరు చేసిన పనిదినాలకు వేతనాలు అడిగే హక్కు ఉంటుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇప్పి ంచటంతో పాటు కాంట్రాక్టు రెన్యూవల్ చేయాలని వారు కోరుతున్నారు.