కామాంధులకు ఉరే సరి..!
మంచిర్యాలక్రైం: అభం శుభం తెలియని చిన్నారులు, మహిళలు, వివాహితలపై లైంగికదాడులకు తెగబడుతున్న కామాంధులకు ఉరి శిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లైంగికదాడులకు పాల్పడిన వారికి ఇతర దేశాల్లో చట్టాల మాదిరిగా బహిరంగంగా కఠిన శిక్ష అమలు చేయాలని కోరుతున్నాయి. అప్పుడే అఘాయిత్యాలను నివారించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చినా దురాఘాతాలు అదుపులోకి రావడం లేదు. అశ్లీల చిత్రాల వెబ్‌సైట్లను పూర్తి స్థాయిలో నిషేధిస్తే తప్ప దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్ట పడదని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న జరిగిన ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించి కఠినమైన నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. మహిళల భద్రత కోసం ప్రత్యేక విభాగాలు, దళాలు ఏర్పాటు చేసింది. అయినా మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం ఘటన రాష్ట్ర ప్రజలను కన్నీరు పెట్టించింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వివాహిత ముగ్గురు కామాంధుల చేతుల్లో బలైంది. ఈ ఘటనలు ప్రజల మది నుంచి ఇప్పుడిప్పుడే చెదిరిపోతుండగా.. దండేపల్లి మండలం నంబాల గ్రామంలో బాలిక(7)పై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడి హత్య చేయడం మరోసారి సంచలనం సృష్టించింది. దిశ కేసు తరహాలో నిందితులకు కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆసిఫా ఆర్డినెన్స్ నిష్పక్షపాతంగా అమలు చేయాలి
12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరి శిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆసిఫా ఆర్డినెన్స్‌కు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఉన్నవ్, కఠువా ఘటనల నేపథ్యంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం మహిళపై అత్యాచారం కేసులో కనీస శిక్ష పదేళ్లకు పెరిగింది. కేసు తీవ్రతను బట్టి దోషులకు 14ఏళ్లు శిక్ష విధించే అవకాశం ఉంది. 16ఏళ్లలోపు అమ్మాయిలపై అఘాయిత్యానికి 20ఏళ్ల వరకు శిక్ష పెంచారు. అవసరమైతే యావజ్జీవ కారాగారం విధిస్తారు. సామూహిక అత్యాచారం కేసులో దోషులకు చనిపోయే వరకు, 12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా 20ఏళ్లు, చనిపోయే వరకు శిక్ష విధించేందుకు ఆర్డినెన్స్ అవకాశం కల్పించింది. ఈ ఆర్డినెన్స్ ఆధారంగా కఠిన శిక్ష విధించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.


