
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం!
మంచిర్యాలక్రైం: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇటు వాహన చోదకులకు అటు ఇతరులకు ప్రాణాంతకంగా మారుతోంది. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలతో చిన్న వాహనదారులు, ప్రజలు రోడ్డెక్కాలంటేనే భయపడాల్సి వస్తోంది. యేటా ప్రమాదాల్లో పలువురు మృతిచెందుతుండగా.. వందల సంఖ్యలో క్షతగాత్రులు అవుతున్నారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే 30 ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించిన పోలీసులు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు సైతం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వీడాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కొరడా ఝళిపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి పలు కారణాలను గుర్తించారు.
కారణాలివే..
● కొత్త కొత్త ఫీచర్లు, హైస్పీడ్‌తో వాహనాలు వస్తున్నాయి. వాహనాల సాంకేతిక పరిజ్ఞానంపై చోదకులకు అవగాహన లేక నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
● రోడ్లపై ఇష్టానుసారంగా గుంతలు తవ్వి వదిలేయడం, వాహనదారుల తొందరపాటు, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే ఆతృత, మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం.
● రహదారుల విస్తరణ, మరమ్మతుల సమసయంలో కాంట్రాక్టర్లు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం.
● గ్రామాల నుంచి హైవే రహదారులకు అనుసంధానం అయ్యే లింకు రోడ్ల వద్ద సరైన అవగాహన, ట్రాఫిక్ నిబంధనలు లేకుండా, ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం.
● వాహనదారులు మద్యంమత్తు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడం, ఒత్తిడిలోనే డ్రైవింగ్ చేయడం.
● మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం.
నివారణ చర్యలు
జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల అధికారుల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాత్రివేళల్లో రోడ్ల వెంట రిఫ్లెక్టింగ్ లైట్లు, అవసరమైన చోట స్పీడ్‌బ్రేకర్లు, కాలినడకన రోడ్డు దాటే చోట జీబ్రా లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ హైవే అధికారులతో చర్చించి ప్రమాదాల నివారణఖు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా సుమారు రూ.60లక్షల విలువైన సామగ్రి అవసరమని పోలీసులు నివేదిక పంపించారు. రూ.40లక్షలు మంజూరు కాగా సూచిక బోర్డులు, జీబ్రాలైన్లు, చిన్న స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో తరచూ ప్రమాదాలు జరుగుతుండేవి. వాటి నివారణకు ఇరువైపు ప్లాస్టిక్ స్టిక్స్ రోప్‌తో లైనింగ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తంగా ఉంచుతున్నారు.
జిల్లాలో గుర్తించిన బ్లాక్‌స్పాట్లు
నేషనల్ హైవే–63
మంచిర్యాల: మేదరివాడ, లక్ష్మిటాకీస్, ఓవర్ బ్రిడ్జి, నస్పూర్ తోళ్లవాగు, అంబేడ్కర్ కాలనీ, తెలంగాణతల్లి చౌక్, సీసీ ఎక్స్‌రోడ్, శ్రీరాంపూర్ పెట్రోల్‌బంక్, శ్రీరాంపూర్ సోనియానగర్, ఎస్‌ఆర్‌పీ–3 మెయిన్‌రోడ్, శ్రీరాంపూర్ బస్టాండ్, జీఎం ఆఫీస్
హాజీపూర్: గుడిపేట బెటాలియన్ పెట్రోల్‌బంక్, ముల్కల్ల బస్‌స్టాప్, బ్రిడ్జి, వేంపల్లి మేకల మండి, జీపీ ఆఫీస్,
లక్సెట్టిపేట: ఆంధ్రబోర్, కరీంనగర్ చౌరస్తా, గుల్ల కోట, రాయపట్నం బ్రిడ్జి
నేషనల్ హైవే–363
రామకృష్ణాపూర్: గద్దరాగడి, బొక్కలగుట్ట, పులిమడుగు, మందమర్రి ఈసర్ పెట్రోల్‌బంక్, ఎస్‌ఎండీసీ కాలేజీ అందుగులపేట, యాపల్ ఏరియా, కాసిపేట జంక్షన్ సోమగూడెం చౌరస్తా, బెల్లంపల్లి గంగరాంనగర్,
స్టేట్ హైవే–1
జైపూర్: అటవీశాఖ చెక్‌పోస్ట్ ఇందారం, ఇందారం ఎక్స్‌రోడ్
స్టేట్ హైవే–24
జన్నారం: పొనకల్ బస్టాండ్, పైడిపల్లి డీర్ పార్క్, దండేపల్లి మండలం ముత్యంపేట అటవీశాఖ చెక్‌పోస్ట్ నుంచి నెల్కి వెంకటపూర్ వరకు
ప్రమాదాల నివారణపై
ప్రత్యేక దృష్టి
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ మొదలుపెట్టాం. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాం. అక్కడ ప్రమాదాలు జరగకుండా జాతీయ, రాష్ట్ర రహదారులు, పోలీసు అధికారుల కమిటీ సమన్వయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు. – సత్యనారాయణ,
ట్రాఫిక్ సీఐ, మంచిర్యాల
జిల్లాలో బ్లాక్‌స్పాట్
ప్రాంతాల్లో ప్రమాదాలు
సంవత్సరం ప్రమాదాలు మృతులు
2022 144 66
2023 95 36
2024 81 48
2025 185 65
రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తం
నివారణపై పోలీసుల ప్రత్యేక దృష్టి
జిల్లాలో 30 బ్లాక్‌స్పాట్లు గుర్తింపు

నిర్లక్ష్యం.. ప్రాణాంతకం!

నిర్లక్ష్యం.. ప్రాణాంతకం!