
మూత‘బడి’ని తెరిపించారు
దండేపల్లి: మండలంలోని కొత్తమామిడిపల్లిలో గత 15ఏళ్ల క్రితం విద్యార్థులు లేని కారణంగా మూతపడిన ప్రాథమిక పాఠశాలను బుధవారం తెరిపించారు. గ్రామంలో బడిని తెరిపించి పిల్లల ను బడికి పంపించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఇటీవల ఎంఈవో చిన్నయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో బుధవారం 20 మంది విద్యార్థులతో పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తహాసీనొద్దీన్, కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీనివాస్, ఎంఐఎస్ నగేష్, సీఆర్పీ నర్సయ్య, మాజీ సర్పంచ్‌లు గడ్డం రాజయ్య, త్రిమూర్తి, మాజీ జెడ్పీటీసీ నాగరాణి, పెరిక సంఘం మండల అధ్యక్షుడు గడ్డం రాంచందర్, వీవీ గడ్డం కీర్తన, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వేంపల్లిలో..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వేంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డీఈఓ యాదయ్య బుధవారం ప్రారంభించారు. పదేళ్ల క్రితం మూతపడిన పాఠశాలలో తాజాగా ఏడుగురు విద్యార్థులు చేరారని, మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, ఎంఈఓ తిరుపతిరెడ్డి, మండల నోడల్ అధి కారి హన్మాండ్లు, ప్రధానోపాధ్యాయుడు సుధారాణి, ఉపాధ్యాయురాలు రేవతి పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రతిభకు డీఈఓ చప్పట్లు
నంనూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ డీఈఓ యాదయ్య చప్పట్లు కొట్టారు. బుధవారం పాఠశాలను తనిఖీ చేసిన ఆయన 1వ, 7వ తరగతి గదుల్లో విద్యార్థుల ప్రతిభా పాఠవాలను పర్యవేక్షించారు. తెలుగు, ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాల్లోని పదాలు, పాఠ్యాంశాలను చదివించి బోర్డుపై పదాలు చెబుతూ రాయించారు. పదాలు స్పష్టంగా రాయడంతో అభినందించారు. విద్యార్థుల ప్రవేశాలను 100వరకు పెంచినందుకు ప్రధానోపాధ్యాయుడు గురవయ్య, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ప్రశంసించారు. సెక్టోరియల్ అధికారి చౌదరి, ఉపాధ్యాయులు సత్యనారాయణచారి, ప్రశాంత్ పాల్గొన్నారు.

మూత‘బడి’ని తెరిపించారు