
‘ప్రాణహిత’లో పెరుగుతున్న నీటిమట్టం
వేమనపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదిలో వరద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద రెండు రోజులుగా నది రెండు పాయలుగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర తీరం వైపు ఎక్కువగా, తెలంగాణ(వేమనపల్లి) తీరం వైపు తక్కువగా వరద ప్రవాహం ఉంది. దీంతో నది చూడముచ్చటగా రెండు పాయలతో నిండుకుండలా పారుతోంది. ప్రయాణికులకు రెండు పడవల ప్రయాణం తప్పడం లేదు. వేమనపల్లి వైపు నుంచి నాటుపడవలో కొద్ది దూరం ప్రయాణించి నది మధ్యలో ఇసుక తిన్నెలపై దిగుతున్నారు. అక్కడ నుంచి ఇంజన్ పడవలో నది దాటి అవతలి వైపు ఉన్న మహారాష్ట్ర తీరం వైపు వెళ్తున్నారు ప్రమాదకరమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అధిక చార్జీలు చెల్లిస్తూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.