
ఆదివాసీలను విడుదల చేయాలి
దండేపల్లి: జన్నారం మండలం కోలాంగూడకు చెందిన ఆదివాసీలు ఆత్రం రాజు, అతడి కుమారులు రవికుమార్, సుధాకర్‌లను వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీల గుడిసెలు, కుల దైవం భీమన్న దేవుని గుడిపై అటవీ అధికారులు దాడి చేసి ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆత్రం రాజు, అతడి ఇద్దరు కుమారులను అకారణంగా అరెస్టు చేశారని ఆరోపించారు. విడుదల చేయని పక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ సేన జిల్లా కోశాధికారి మర్సుకొల సంతోష్, రాజ్‌గోండ్ సేవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంద్రం నరేందర్, నాయకులు టేకం భీంరావ్, అడై తిరుపతి, అడై భగవంత్‌రావ్ పాల్గొన్నారు.
అటవీశాఖ అధికారుల దిష్టిబొమ్మ దహనం
పాతమంచిర్యాల: అటవీ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదివాసీలపై అక్రమంగా కేసులు బనాయించి హింసకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జన్నారం మండలం తపాలాపూర్‌లో ఆది వాసీల దైవం భీమన్నదేవుని గుడిని అటవీ అధికా రులు ధ్వంసం చేయడం అన్యాయమని అన్నారు. దీనిపై నిలదీసిన ఆత్రం రాజు, అతడి ఇద్దరు కుమారులు రవికుమార్, సుధాకర్‌లపై అక్రమ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్, దూలం శ్రీనివాస్, ప్రేంకుమార్, మిడివెళ్లి రాజు, అరిగెల మహేష్, మోహన్ పాల్గొన్నారు.

ఆదివాసీలను విడుదల చేయాలి