
విద్యారంగం బలోపేతానికి చర్యలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● పాఠశాలలు, ఇందిరమ్మ ఇళ్ల సందర్శన
జైపూర్: విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని పౌనూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన, మధ్యాహ్న భోజన సదుపాయాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, బడియట పిల్లలు, మానివేసిన పిల్లలను తిరిగి చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రంలో శారీరక, మానసిక ఎదుగుదల లోపం ఉన్న పిల్లల కు ఆహారం, అవసరమైన మందులు అందించాలని పేర్కొన్నారు. అనంతరం శివ్వారం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, వంటశాల పరిసరాలు పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి వేగవంతం పూర్తి చేయాలని సూచించారు. డీసీఎంఎస్ ఫార్మర్ సర్వీస్ సెంటర్‌లో ఎరువులు, విత్తనాల నిల్వలు, రిజిష్టర్లు పరిశీలించారు. గంగిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, జైపూర్‌లోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయంలో రేషన్‌కార్డుల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులు జారీ చేయాలి, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు.