
జిల్లాలో యూరియా కొరత లేదు
నెన్నెల: జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన అన్నారు. ‘యూరియా కోసం రైతుల కొట్లాట’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు స్పందించారు. బుధవారం మండల కేంద్రంలోని మహిళా ఉత్పత్తిదారుల సంస్థ(డబ్ల్యూఎఫ్‌పీసీ)తోపాటు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా నిల్వలు, రిజిష్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల గొడవ యూరియా కోసం కాదని, వ్యక్తిగత కారణాలతో గొడవపడినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. మండలానికి 342మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, డీలర్లు దుకాణాలు రోజూ తెరిచి ఉంచాలని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ–పాస్ యంత్రాల పంపిణీ
నెన్నెల రైతు వేదికలో భీమిని, నెన్నెల, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల ఎరువుల డీలర్లకు ఈ–పాస్ యంత్రాలను జిల్లా వ్యవసాయ అధికారి కల్పన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ–పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని, అమ్మకాలు, నిల్వల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. ఈ–పాస్ యంత్రంలో వివరాలు నమోదు చేస్తే ఎంత ఎరువులు ఎవరి పేరు మీద అమ్మారనేది తెలుస్తుందని అన్నారు. ఈ విధానం ద్వారా ప్రతీ గ్రామం, మండలం, జిల్లా వారీగా పంటల సాగు విస్తీర్ణం అంచనాల ప్రకారం ఎరువుల వినియోగాన్ని పర్యవేక్షించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిని ఏడీఏ సురేఖ, ఏఓ సృజన, ఏఈఓ రాంచందర్ పాల్గొన్నారు.

జిల్లాలో యూరియా కొరత లేదు