
మావోయిస్టులు లొంగిపోవాలని పోస్టర్లు
వేమనపల్లి/భీమిని: సిద్ధాంతాల కోసం అడవి బాట పట్టిన మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాఫ్రంట్ తెలంగాణ పేరిట వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లో బుధవారం పోస్టర్లు వెలిశాయి. వేమనపల్లి మండలం ప్రాణహిత సరిహద్దు గ్రామాలైన కళ్లంపల్లి, ముక్కిడిగూడెం, జాజులపేట, సుంపుటం గ్రామాల సమీప కల్వర్టులు, మిషన్ భగీరథ వాటర్‌ట్యాంకులు, సూచిక బోర్డులకు, కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయం, గ్రామీణ బ్యాంక్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. మావోయిస్టు అగ్ర నాయకులారా మీరు నమ్మిన కాలం చెల్లిన సిద్ధాంతాలు సామాన్యుడికి ఆశాకిరణాలు ఎక్కడయ్యాయి, మీరు నమ్మిన ఉద్యమబాట ప్రజాదరణ లేక మోడుబారిన బీడు భూమి అయ్యిందని, అడవిని వీడి ప్రజల్లోకి రావాలని పోస్టర్లలో పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. వేమనపల్లి మండలంలోని గ్రామాల్లో వెలిసిన పోస్టర్లపై ఎస్సై శ్యాంపటేల్ విచారణ చేపట్టారు.